అపర కుబేరుడు అదానీ
Published: Wed, 20 Jul 2022 02:09:56 IST

ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలోకి
ఈ జాబితాలో పదో స్థానంలో ముకేశ్ అంబానీ
ఆర్థిక సంస్కరణలతో వేగంగా వ్యాపార విస్తరణ
మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పటి నుంచి స్నేహం
ఆయన ప్రధాని అయ్యాక విస్తరించిన అదానీ సామ్రాజ్యం
ఐశ్వర్యం గురించి చెప్పాలంటే ఒకప్పుడు టాటా, బిర్లాల గురించి చెప్పేవాళ్లు. ఇప్పుడా స్థానాన్ని అంబానీ, అదానీ ఆక్రమించారు. ఈ ఇద్దరిలోనూ చాలాకాలంగా రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీదే పైచేయిగా ఉండేది. తాజాగా.. ఫోర్బ్స్ ప్రకటించిన ప్రపంచ కుబేరుల జాబితాలో అదానీ అక్షరాలా 9.22 లక్షల కోట్ల రూపాయల సంపదతో నాలుగో స్థానం సాధించారు. రూ.7 లక్షల కోట్లతో అంబానీ పదోస్థానంలో ఉండడం గమనార్హం. మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ తన సంపదలో 20 బిలియన్ డాలర్లను గేట్స్ ఫౌండేషన్‌కు విరాళంగా ఇవ్వడంతో ఆయన ఐదో స్థానానికి పరిమితమయ్యారు. రూ.18.5 లక్షల కోట్లతో ఈలన్ మస్క్, రూ.12.37 లక్షల కోట్లతో బెర్నార్డ్ ఆర్నాల్ట్, రూ.11.42 లక్షల కోట్లతో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఈ జాబితాలో తొలి మూడు స్థానాల్లో నిలిచారు. కాగా.. అదానీ సాధించిన ఈ ఘనత దాదాపు మూడు దశాబ్దాలకు పైగా చేసినకృషికి ఫలితం. 1962 జూన్ 24న.. గుజరాత్‌కు చెందిన ఒక జైన కుటుంబంలో గౌతమ్ అదానీ జన్మించారు. ఆయన తల్లిదండ్రులు శాంతిలాల్ అదానీ, శాంతాబెన్ అదానీ. శాంతిలాల్ అదానీ ఒక సాదాసీదా వస్త్రవ్యాపారి. గౌతమ్ అదానీ పాఠశాల విద్యాభ్యాసమంతా అహ్మదాబాద్‌లో జరిగింది. ఆ తర్వాత బీకామ్‌లో చేరారుగానీ.. రెండో సంవత్సరంలో కాలేజీ మానేశారు. ఆయన ధ్యాస అంతా వ్యాపారంపైనే ఉండేది. అయితే తన తండ్రిలా చిన్న వ్యాపారిలా ఉండిపోవాలనుకోలేదు. స్కూల్లో చదువుకునేటప్పుడు ఒకసారి ఎడ్యుకేషనల్ టూర్‌లో భాగంగా కాండ్లాకు వెళ్లి అక్కడ ఓడరేవును చూసిన అదానీ మెదడులో అక్కడి దృశ్యాలు ముద్రపడిపోయాయి. ఎప్పటికైనా తానూ అలాంటి ఒక పోర్టును నిర్వహించాలని సంకల్పించుకున్నారు. ఈ క్రమంలోనే.. డిగ్రీ చదువు మధ్యలోనే మానేసి వ్యాపారం కోసం ముంబైకి చేరుకున్నారు. అక్కడ కొన్నాళ్లు వజ్రాలను గ్రేడింగ్ చేసే పని చేశారు. తర్వాత రెండేళ్లకే సొంతంగా వజ్రాల వ్యాపారాన్ని ప్రారంభించి 20 ఏళ్లకే కోటీశ్వరుడయ్యారు. అనంతరం తన సోదరులకు సాయంగా ఉండేందుకు తిరిగి గుజరాత్‌కు చేరుకున్నారు. 1988లో.. ‘అదానీ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్’్థను ప్రారంభించారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ‘అదానీ ఎంటర్‌ప్రైజెస్’ అదే. 1993లో గుజరాత్ ప్రభుత్వం ముంద్రా పోర్టు నిర్వహణను ప్రైవేటువారికి అప్పజెప్పడానికి సిద్ధం కాగా ఆ కాంట్రాక్టును గౌతమ్ అదానీ చేజిక్కించుకున్నారు. అలా.. చిన్ననాడు తాను కన్న కలను సాకారం చేసుకున్నారు.
అన్నింటా అగ్రస్థానం
దాదాపు మూడున్నర దశాబ్దాల క్రితం ప్రస్థానం ప్రారంభించిన అదానీ గ్రూపులో ఇప్పుడు ఏడు కంపెనీలు.. రెండు డజన్లకు పైగా వ్యాపారాల్లో సత్తా చాటుతున్నాయి. అన్నీ దేశంలోనే అగ్రశ్రేణిలో నిలిచిన సంస్థలు. ఉదాహరణకు.. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ భారతదేశపు అతి పెద్ద ప్రైవేట్ పోర్ట్ ఆపరేటర్. 13 పోర్టులు దీని నిర్వహణలో ఉన్నాయి. ఇక అదానీ తొలి సంస్థ.. అదానీ ఎంటర్‌ప్రైజెస్ దేశంలోనే అతిపెద్ద బొగ్గు వాణిజ్య సంస్థ, బొగ్గు తవ్వకాల గుత్తేదారు. అంతేకాదు.. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ ఎయిర్‌పోర్టు ఆపరేటర్ కూడా. అదానీ ఎంటర్‌ప్రైజెస్ నిర్వహణలో దేశంలోని ఎనిమిది విమానాశ్రయాలున్నాయి. ఇక అదానీ గ్రీన్ ఎనర్జీ... ప్రపంచంలోనే అతిపెద్ద సౌర విద్యుత్తు ఉత్పత్తి చేసే సంస్థల్లో ఒకటి. అదానీ ట్రాన్స్‌మిషన్.. దేశంలోనే అతి పెద్ద ప్రైవేట్ సెక్టార్ ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్ కంపెనీ. ఇక అదానీ విల్మర్.. దేశంలోనే అతిపెద్ద ఎడిబుల్ ఆయిల్ బ్రాండు. అదానీ టోటల్ గ్యాస్.. దేశంలోనే అతి పెద్ద ‘సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్’ సంస్థ. చివరగా.. అదానీ పవర్.. దేశంలోనే అతి పెద్ద ప్రైవేటు థర్మల్ విద్యుత్తు ఉత్పత్తి సంస్థ. సోలార్ మాన్యుఫ్యాక్చరింగ్, లాజిస్టిక్స్, ఇండస్ట్రియల్ ల్యాండ్, డిఫెన్స్, ఏరోస్పేస్, డేటా సెంటర్స్, రోడ్, రైల్, రియల్ ఎస్టేట్.. ఒక్కటనేమిటి అదానీ సంస్థలు కాలుమోపని రంగం లేదు. అయితే.
30 ఏళ్లుగా వ్యాపార రంగంలో ఉన్న అదానీ గత కొన్నేళ్ల వ్యవధిలోనే ‘వ్యాపారి’ స్థాయి నుంచి ‘వ్యాపార దిగ్గజ’ స్థాయికి ఎలా ఎదిగారు? అనేది చాలా మంది సందేహం. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పటి నుంచే అదానీతో ఆయనకు స్నేహం ఉండేదని.. మోదీ ప్రధాని అయ్యాక ఆ హోదాలో అదానీకి ఉపయోగపడేలా ఆయన తీసుకున్న నిర్ణయాల వల్లే అదానీ వ్యాపార సామ్రాజ్యం, ఆయన సంపద విస్తృతంగా పెరిగిపోయాయనే ఆరోపణలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి.
మోదీ, అదానీ బంధం
ప్రధానిగా పగ్గాలు చేపట్టేందుకు మోదీ 2014 మే చివరివారంలో ఢిల్లీకి బయల్దేరింది అదానీ విమానంలోనే! ఆ తర్వాత కాలంలో మోదీ సర్కారు తీసుకున్న పలు నిర్ణయాలు అదానీకి అనుకూలంగా ఉన్నాయనడంలో సందేహమేమీ లేదు. ఉదాహరణకు.. 2018లో భారత ప్రభుత్వం ఆరు విమానాశ్రయాలను ప్రైవేటుకు అప్పగించింది. ఆ ఎయిర్‌పోర్టులను అదానీకి అప్పజెప్పడం కోసమే.. ఎలాంటి అనుభవం లేనివారు కూడా బిడ్లు వేసేలా నిబంధనలను సైతం సవరించిందని, చివరికి అన్ని విమానాశ్రయాలనూ అదానీకే కట్టబెట్టిందని అప్పట్లోనే చాలామంది ఆగ్రహం వ్యక్తం చేశారు. త్రివేండ్రం ఎయిర్‌పోర్టు నిర్వహణకు సంబంధించి 50 ఏళ్ల లీజును అదానీ దక్కించుకోవడంపై నాటి కేరళ ఆర్థిక మంత్రి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆ ఎయిర్‌పోర్టును అదానీకి అప్పగించడాన్ని..

మోదీ సర్కారు ‘సిగ్గులేకుండా చేపట్టిన ఆశ్రిత పక్షపాత చర్య’గా అభివర్ణించారు. ఏదేమైనా ఆ దెబ్బతో అదానీ దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ ఎయిర్‌పోర్టు ఆపరేటర్స్‌లో ఒకరుగా నిలిచారు. మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెద్ద ఎత్తున ప్రభుత్వ టెండర్లను దక్కించుకోవడం ద్వారా.. ఈ ఎనిమిదేళ్లల్లో ఆయన ఆస్తులు ఎన్నో రెట్లు పెరిగినట్లు సమాచారం. పాత విషయాలన్నీ పక్కన పెడితే.. శ్రీలంకలో ఒక విద్యుత్తు ప్రాజెక్టును అదానీకి ఇవ్వాలంటూ భారత ప్రధాని మోదీ శ్రీలంక ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారంటూ సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డు చైర్మన్ అక్కడి పార్లమెంటరీ బోర్డు ముందు చెప్పడం తాజా సంచలనం. అయితే, ఒకటి మాత్రం నిజం. మోదీ అండవల్ల అదానీ వ్యాపార విస్తరణ వేగం ఇతోధికంగా పెరిగి ఉండొచ్చుగానీ.. వ్యాపారవేత్తగా అదానీ శక్తిసామర్థ్యాలను శంకించడానికి వీల్లేదని వ్యాపార రంగ నిపుణులు చెబుతారు. - సెంట్రల్ డెస్క్
Comments
Post a Comment