‘విశాఖ’పై ప్రధాని తక్షణ ఆదేశం

నిర్లక్ష్యంపై కఠినంగా
కారణమైన కంపెనీపై విచారణ
‘విశాఖ’పై ప్రధాని తక్షణ ఆదేశం
విషాదంపై చలించిన మోదీ
దిగ్ర్భాంతికరం : ఉపరాష్ట్రపతి

న్యూఢిల్లీ, మే 7 (ఆంధ్రజ్యోతి): విశాఖ గ్యాస్‌ లీకేజీ దుర్ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్రంగా స్పందించారు. ఈ ప్రమాద సమాచారం తెలుసుకున్న మరుక్షణమే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, సంబంధిత ఉన్నతాధికారులతో మోదీ మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆరా తీసారు. తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని వారిని ఆదేశించారు. మరణాల సంఖ్య పెరగకుండా ఎమర్జెన్సీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జాతీయ విపత్తుల నిర్వహణ (ఎన్డీఆర్‌ఎఫ్‌) దళాలు, నౌకాదళాలను తరలించాలని సంబంధిత ఉన్నతాధికారులను కోరారు. గురువారం ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్రమోదీ ఉన్నతస్థాయి అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా,  రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డితోపాటు పలువురు మంత్రులు, ఎన్టీఆర్‌ఎఫ్‌, సంబంధిత ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విశాఖపట్నంలో గ్యాస్‌ లీకేజీకి దారి తీసిన పరిస్థితులను ఈ సందర్భంగా సమీక్షించారు. ప్రమాద తీవ్రత, పరిశ్రమ యాజమాన్యం, వాతావరణ కాలుష్య నియంత్రణ సంస్థల అలసత్వం తదితర అంశాలతోపాటు మృతులు, బాధితులు, వైద్యసహాయక చర్యలపై చర్చించారు. లీకేజీకి పాల్పడి, ప్రజల ప్రాణాలను బలిగొన్న పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యంపై విచారణ జరిపించి, కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాని.. సంబంధిత మంత్రులు, ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై విచారణకు ప్రత్యేక ఉన్నతస్థాయి కమిటీని నియమించారు. ఈ కమిటీలో కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, కేంద్ర రసాయనశాఖ కార్యదర్శి ఉంటారు. గ్యాస్‌ లీకేజీ ప్రభావాన్ని నియంత్రించడంతోపాటు బాధితులకు సహాయం చేయడంపై ఈ కమిటీ చర్యలు తీసుకుంటుందని ప్రధాని ట్విట్టర్‌లో తెలిపారు. బాధితులు త్వరితగతిన కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో బయటపడాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు ట్వీట్‌ చేశారు. ప్రమాద వార్త చేరగానే కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను తొలుత ప్రధాని అప్రమత్తం చేశారు. ఈ విషయం తెలియగానే ‘నేను చలించిపోయాను’ అని అమిత్‌షా అన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని చెప్పారు.

విశాఖ గ్యాస్‌ ప్రమాదంపై విచారణ జరిపించి, కంపెనీ నిర్లక్ష్యంపై చర్యలు తీసుకుంటామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలుగువాడైన కిషన్‌ రెడ్డితోను, సీఎం జగన్మోహన్‌రెడ్డితోను గ్యాస్‌ ప్రమాదంపై హోం మంత్రి అమిత్‌షా మాట్లాడారు. ఆ వెంటనే కిషన్‌ రెడ్డి స్పందించి... రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్‌కు ఫోన్‌ చేశారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థనూ ఆయన అప్రమత్తం చేశారు. ప్రజలకు భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మీడియాకు కిషన్‌రెడ్డి తెలిపారు. గ్యాస్‌ ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలు, బాధిత కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం తరఫున అన్నివిధాలా అండగా ఉంటామని, ఎవ్వరూ అధైర్యపడొద్దని, ఽధైర్యంగా ఉండాలని కోరారు. ఆస్పత్రిలో ఉండేవారికి పూర్తిగా సహకారం అందిస్తామని తెలిపారు. ప్రజలను భయపెట్టే వార్తలు సామాజిక మాధ్యమాల్లో వస్తున్నాయని, వాటిని ప్రజలు నమ్మవద్దని కిషన్‌రెడ్డి కోరారు. తప్పుడు సమాచారంతో ప్రజలను భయభ్రాంతులను చేయడం మానుకోవాలని హితవు పలికారు.

దీర్ఘకాలిక ప్రభావం చూపదు: ఎయిమ్స్‌

స్టైరిన్‌ గ్యాస్‌ దీర్ఘకాలిక ప్రభావం చూపదని ఢిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా మీడియాకు తెలిపారు. అయితే ఈ గ్యాస్‌ను పీల్చినవారిలో కళ్ల మంట, గొంతు నొప్పి,  వాంతులు వంటి ఆరోగ్య సమస్యలు కనిపిస్తాయని వివరించారు. కాగా, తమ దళాలు సంఘటనా స్థలానికి ఉదయం ఆరింటికే  వెళ్లి పరిసర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఎన్డీఆర్‌ఎఫ్‌ అధిపతి ఎస్‌ఎన్‌ ప్రధాన్‌ తెలిపారు. 80 నుంచి వందమందిని హెలికాప్టర్లలో తీసుకొళ్లి ఆస్పత్రుల్లో చేర్చినట్టు పేర్కొన్నారు.

విశాఖ కోలుకోవాలి: సీఎంలు

గ్యాస్‌ ప్రమాద మృతుల కుటుంబాలకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు. అస్వస్థతకు గురైనవారంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. విశాఖ త్వరగా కోలుకోవాలని, దుర్మరణం చెందినవారి ఆత్మశాంతి కలగాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కోరారు. ఆస్పత్రుల్లో ఉన్నవారు వెంటనే కోలుకోవాలని  కేరళ ముఖ్యమంత్రి విజయన్‌ ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు తమిళనాడు ముఖ్యమంత్రి కె.పళనిస్వామి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Comments

Popular posts from this blog

Crypto Newbies Have Family And Friends To Thank For Losses

అపర కుబేరుడు అదానీ

Reliance Jio Tops 5G Spectrum Bids With ₹ 88,078 Crore,